NTV Telugu Site icon

Delhi Elections: సీఎం అతిషిపై ఎఫ్‌ఐఆర్.. ఏం కేసు బుక్ చేశారంటే..!

Atishi

Atishi

దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలాంటి సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారంటూ అతిషిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గోవిందపూరి పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఫతే సింగ్ మార్గ్‌లో ఆప్ అభ్యర్థి అతిషి 50 నుంచి 70 మంది మద్దతుదారులతో పాటు 10 వాహనాలతో కనిపించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్గదర్శకాలను అనుసరించి ఆ ప్రాంత్రాన్ని ఖాళీ చేయాలని వారిని పోలీసులు అదేశించారు. కానీ ఆ అధికారిని.. తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రాణాంతక క్యాన్సర్ ఎన్ని రకాలో తెలుసా..?

మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా… ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు.

ఇది కూడా చదవండి: Balakrishna : “బాలయ్య బాబు = ఎమోషనల్”.. లోకేష్ చెప్పిన కొత్త భాష్యం

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి.

ఇది కూడా చదవండి: Spinal problems: యువతలో వెన్నెముక సమస్యలు.. ప్రధాన కారణాలు, నివారణ ఇదే..!