Delhi protests: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న యువత ఆందోళనల నేపథ్యంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాలని డీఎంఆర్‌సీ సూచించింది. భద్రతా కారణాలతో మూసివేసిన మెట్రో స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జనపథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం ఉన్నాయి.
ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియోలు లేదా సోషల్ మీడియాలో కనిపించే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సుమోటో చర్యలు తీసుకునేందుకు తమకు సమయం లేదని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అలాగే, విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంలో చట్టపరంగా అందుబాటులో ఉన్న ఇతర న్యాయ మార్గాలను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. మొత్తంగా ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు, భద్రతా ఏర్పాట్లు, న్యాయస్థానం తాజా నిర్ణయాలతో రాజధానిలో పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు..

