దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. అంతకంతకు తెగిస్తున్నారు తప్ప.. మార్పు రావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యతో సహా ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా హతమార్చాడు.
ఇది కూడా చదవండి: CPI Narayana: కేంద్రం కటాక్షం లేకపోతే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు పోకుండా ఉంటారా..?
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కరావాల్ నగర్ ప్రాంతంలో ఒక ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. భార్య, 5, 7 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తెలను అత్యంత దారుణంగా తండ్రే హతమార్చాడు. భార్య జయశ్రీ(28)తో చాలా కాలంగా కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి గొడవలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఘర్షణలో భార్యతో పాటు పిల్లల్ని చంపేసి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యలకు ఇంకా కచ్చితమైన కారణం తెలియదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు. మృతదేహాలను జీటీబీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించాయి. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్: నా ఫోన్, సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు
భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతుంటారని ఇరుగుపొరుగు వారు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటలకు హత్యల సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. తలుపు తెరిచినప్పుడు తల్లి, ఇద్దరు కుమార్తెలు మంచం మీద ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు.
