NTV Telugu Site icon

Delhi LG Anil Baijal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజల్ రాజీనామా

Anil Baijal Lg

Anil Baijal Lg

ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజల్ బుధవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే అనిల్ బైజల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కు ఆయన రాజీనామాను సమర్పించారు. ఢిల్లీకి సుదీర్ఘ కాలం ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. 2016 డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు చేపట్టిన బైజల్ ఐదేళ్ల నాలుగు నెలలు ఎల్జీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , ఎల్జీ అనిల్ బైజల్ కు పలుమార్లు ఘర్షణ తలెత్తింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఐఎఎస్ అధికారులు ప్రభుత్వానికి సహకరించడం లేదని కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఎల్జీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి, ఎల్జీకి మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వ పాలనలో ఎల్జీ కార్యాలయం జోక్యం చేసుకుంటుందని చాలా సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగంగానే ఆరోపించారు. దీంతో పాటు ఇటీవల ఢిల్లీలో కోవిడ్ కర్ఫ్యూ ఎత్తేయాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటే… ఎల్జీ అనిల్ బైజల్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. కోవిడ్ కేసులు తగ్గలేదని కుదరదని చెప్పారు.

1969 బ్యాచ్ కు చెందిన బైజల్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. అటల్ బీహారీ వాజ్ పేయి సర్కార్ లో బైజాల్ హోం కార్యదర్శిగా పనిచేశారు.  యూపీఏ ప్రభుత్వం  నెహ్రూ నేషనల్ అర్భన్ రెన్యూవల్ మిషన్ ను పర్యవేక్షించే కార్యక్రమానికి అనిల్ బైజల్ ను పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. బ్యూరో క్రసీలో 37 ఏళ్ల కెరీర్ కలిగిన అనిల్ బైజల్ ఎయిర్ లైన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రసార భారతి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, గోవా డెవలప్మెంట్ కమిషన్ గా, నేపాల్ లో భారత దేశ సహాయ కార్యక్రమానికి ఇంచార్జ్ కౌన్సిలర్ గా కూడా పనిచేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ పొందిన బైజల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ సెక్రటరీ జనరల్ గా కూడా పనిచేశారు.