Site icon NTV Telugu

Delhi Floods: ఇంకా వరద గుప్పిట్లోనే ఢిల్లీ.. వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Delhi Floods

Delhi Floods

Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. ఇప్పటికే వరద నీటితో ఉన్న ఢిల్లీకి భారత వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. యమునా నదిలో నీటి మట్టం తగ్గినప్పటికీ.. నది ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తుంది. శనివారం ఉదయం 8 గంటలకు యమునా నది నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది. అయితే యమునా నది‌లో నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి పెరగడంతో.. ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఐటీవో, శాంతి వన్ ప్రాంతం, ఆదాయపు పన్ను కార్యాలయం, ఇతర కీలక ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి 11 గంటలకు యమునా నీటిమట్టం 207.98 మీటర్లుగా నమోదైంది. యమునా నీటి మట్టం తగ్గడంతో.. గురువారం మూసివేసిన ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాన్ని తెరిచారు. ఓఖ్లా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను పునఃప్రారంభించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. శనివారం ఉదయం నాటికి యమునా నది నీటిమట్టాలు 207.7 మీటర్లకు తగ్గితే.. వజీరాబాద్‌, చంద్రవాల్‌లోని మరో రెండు నీటి శుద్ధి ప్లాంట్లను కూడా పునఃప్రారంభిస్తామని చెప్పారు.

Read also: Tamannaah Bhatia: బటన్స్ విప్పేసి.. హాట్ పోజులిచ్చిన తమన్నా భాటియా!

అయితే యమునా నదిలో నీటిమట్టం స్వల్పంగా తగ్గడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ.. వాతావరణ శాఖ వర్ష సూచన ఉన్నట్టుగా ప్రకటించడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో భారీ వర్షాలు, వరదల నుంచి ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఐటీవో, రాజ్‌ఘాట్‌తో సహా సెంట్రల్ ఢిల్లీలోని కీలక ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)ని రంగంలోకి దించారు. హనుమాన్ మందిర్, యమునా బజార్, గీతాకాలనీ, సివిల్ లైన్స్ వెలుపల ఉన్న రహదారులు కూడా నీటితో నిండిపోయాయి. నిగమ్ బోద్ ఘాట్‌తో సహా ఢిల్లీలోని సుప్రీంకోర్టు, కొన్ని శ్మశానవాటికలకు కూడా వరద నీరు చేరుకుంది. ఢిల్లీలో వర్షాలు కురవకపోతే రెండు రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని.. అయితే వర్షాలు కురిస్తే మరికొంత సమయం పట్టవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. వరదల కారణంగా ఢిల్లీ అస్తవ్యస్తంగా మారింది. ఏ రోడ్డు చూసినా మోకాళ్ల లోతు నీటితో నిండిపోయి ఉంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం సహా మంత్రుల ఇళ్లు, సచివాలయం, ఎర్రకోట, రాజ్ ఘాట్, దేశ అత్యున్నత న్యాయస్థానం పరిసరాలన్నీ వరద నీటితో నిండిపోయాయి.

Exit mobile version