CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..

  • జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నా ఎందుకు వెళ్లారు.?
  • బాండ్ ఇచ్చి, దానిని ఎందుకు ఉల్లంఘించారు.?
  • జిల్లా మేజిస్ట్రేట్ వెళ్లక, హైకోర్టు ఎందుకు వచ్చారు?
  • సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు జెన్-జీ కాదు.
  • సీజేపీ నేతల బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఘాటు ప్రశ్నలు.
Cjp

Cjp

CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా బెయిల్‌ పిటిషన్ విచారణ ఢిల్లీ హైకోర్టులో బుధవారం జరిగాయి. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ఘాటు ప్రశ్నలు సంధించింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలు అధికారికంగా అనుమతులు తొలగించినప్పటికీ, మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రత్నామ్నాయంగా 2 కిలోమీటర్ల దూరంలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పుడు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించింది. ‘‘మీరు ఎవరు? బాండ్‌ను ఉల్లంఘించడానికి కారణం ఏమిటి? మీరు పాలన మార్పు ఎందుకు కోరుకుంటున్నారు.? శాంతిభంగంపై ఆందోళనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) తప్పక పరిగణలోకి తీసుకోవాలి’’ అని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

అక్టోబర్ 21న జస్టిస్ సుబ్రమనియం ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం సీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (SEM) ఇచ్చిన ఉత్తర్వులను నేరుగా హైకోర్టులో సవాలు చేయడానికి బదులుగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు అప్పీల్ లేదా రివిజన్ మార్గాన్ని ఎందుకు అనుసరించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

నిరసనల సమయంలో బారికేడ్లు దాటడం లేదా ధ్వంసం చేయడం వల్ల నిరసనకారుల నియంత్రణ దాటి వెళ్లే ప్రమాదం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తారని, వాటిని తొలగిస్తే నిరసనలో భాగం కాని ఇతరులు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను కూడా కోర్టు ప్రస్తావించింది. విద్యార్థుల నిరసనగా ప్రారంభమై దోపిడీ, అల్లర్లు, హింసాత్మక ఘటనకు దారితీశాయని కోర్టు ఉదహరించింది. నిరసనల సమయంలో పోలీసులు అనుమతి తీసుకోవడం కేవలం ఆంక్షల కోసం మాత్రమే కాదని, శాంతిభద్రతల్ని నిర్వహించడానికి అని కోర్టు అభిప్రాయపడింది.

ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలంగా తొలగించి, రామ్ ‌లీలా మైదాన్, బురారీ మైదాన్, సీబీడీ మైదాన్ వంటి ప్రత్యామ్నాయ ప్రదేశాలు సూచించిన విషయం కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. సమీపంలో మరో ప్రదేశంలో నిరసన చేపట్టే అవకాశ ఉంటే, అక్కడ నిరసన నిర్వహించడానికి మీకు ఇబ్బంది ఏంటి? అని కోర్టు ప్రశ్నించింది. ఇదే సమయంలో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల వయసు గురించి కోర్టు ప్రశ్నించింది. దాస్ వయసు 27 ఏళ్లని, రాంకా వయసు 31 ఏళ్లని, వీరిని జెన్-జీగా పరిగణించలేమని, వీరు మిలీనియల్స్ అని కోర్టు వ్యాఖ్యానించింది.