Site icon NTV Telugu

Goa Bar Row: స్మృతి ఇరానీ కుమార్తెకు ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్

Zoish Irani Clean Chit

Zoish Irani Clean Chit

Delhi High Court Gives Clean Chit To Smriti Irani Daughter Zoish Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవాలో బార్ & రెస్టారెంట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే! బీజేపీ vs కాంగ్రెస్ రాజకీయ పోరులో జోయిష్‌ను జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా సీన్‌లోకి లాగారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలైన స్మృతి ఇరానీ.. ఢిల్లీ హైకోర్టులో ఆ ముగ్గురిపై పరువునష్టం దావా వేసింది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం.. జోయిష్ ఇరానీ పేరుపై గోవాలో బార్ & రెస్టారెంట్ ఉన్నట్టు రికార్డుల్లో లేదని స్పష్టం చేసింది.

స్మృతి గానీ, ఆమె కూతురు గానీ గోవాలో బార్‌కు యజమానులు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కనీసం ఫుడ్ అండ్ బేవరేజెస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న దాఖలాలు కూడా లేవని వెల్లడించింది. అంతేకాదు.. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగానే తప్పుడు ఆరోపణలతో వ్యక్తిగత దాడులకు దిగినట్టు అర్థమవుతోందని ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పరువుప్రతిష్ఠలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఈ వ్యక్తిగత ఆరోపణలు చేశారని భావిస్తున్నట్టు తెలిపింది.

నిజానిజాలేంటో తెలుసుకోకుండా.. ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలు నిందారోపణలు చేశారని హైకోర్టు పేర్కొంది. ఇది స్మృతి ఇరానీ, ఆమె కుటుంబ సభ్యుల గౌరవాన్ని దెబ్బ తీసిందని తెలిపింది. దురుద్దేశంతోనే ఈ బూటకపు ప్రకటనలు చేశారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఆ ముగ్గురికి సమన్లు జారీచేసింది. ట్విట్టర్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

Exit mobile version