NTV Telugu Site icon

Sunita Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు

Wife Of Kejriwal

Wife Of Kejriwal

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుట్రలో భాగంగానే ఈడీ తప్పుడు అరెస్ట్ చేసిందని సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియాను ఆమె విడుదల చేశారు. కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను ఆమె కోరారు. నిజాయితీపరుడు, విద్యావంతుడు, దేశభక్తి గల వ్యక్తిని తప్పుడుగా ఇరికించారని ఆమె పేర్కొన్నారు. లోతైన రాజకీయ కుట్రలో కేజ్రీవాల్‌ను బలిపశువును చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిందని శనివారం ఆమె పేర్కొన్నారు.

ఈడీకి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని.. కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ పరిణామం జరిగిందని వివరించారు. మార్చి 16, 2021న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలిశారని.. ఛారిటబుల్ ట్రస్ట్‌కు సంబంధించిన భూమి కోసం కలిసినట్లు తెలిపారు. ఇక కొడుకు అరెస్ట్ తర్వాత జూలై 12, 2023న తన స్టేట్‌మెంట్‌ను ఎంపీ మార్చుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ రూ.100 కోట్లు చెల్లించాలని 10 మంది సమక్షంలో అడిగారని ఎంపీ చెప్పారు. అసలు ఎవరైనా అంత మంది సమక్షంలో  అంత డబ్బు అడుగుతారా? అని సునీత ప్రశ్నించారు. వాంగ్మూలాన్ని మార్చిన తర్వాతే కొడుకు రాఘవకు బెయిల్ వచ్చిందని ఆమె గుర్తుచేశారు. అంటే దీనిని బట్టి ఎంపీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని అర్థమవుతుందన్నారు. ఈడీ, సీబీఐను అడ్డంపెట్టుకుని బీజేపీ సర్కార్.. ఆప్‌ను అంతం చేయాలని అనుకుంటున్నారని సునీతా ఆరోపించారు.