Terror Threat to Delhi BJP HQ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్‌లోని భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర కార్యాలయంతో పాటు సమీపంలోని కీలక ప్రభుత్వ సంస్థలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను, పారామిలటరీ దళాలను మోహరించాయి.
ఆత్మాహుతి దాడులు, కారు బాంబులతో కుట్ర!
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఈసారి అత్యంత విధ్వంసకర పద్ధతులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లు, కాల్పులకు తెగబడటం లేదా ఐఈడీలను అమర్చడం వంటి కుట్రలు పన్నుతున్నట్లు హెచ్చరికలు అందాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేలా స్పెషల్ ఫోర్స్ రెడీగా ఉంది.
ఢిల్లీని వణికించిన గత దాడులు..
దేశ రాజధాని ఎప్పుడూ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉందనడానికి గతంలో జరిగిన దాడులే నిదర్శనం. నిఘా వర్గాలు ఇప్పుడు అప్రమత్తం కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. డిసెంబర్ 13న ప్రజాస్వామ్య దేవాలయంలాగా భావించే పార్లమెంట్‌పై ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో భద్రతా బలగాలు ఉగ్రవాదులను హతమార్చినప్పటికీ, పలువురు జవాన్లు వీరమరణం పొందారు. 2005లో దీపావళి, ఈద్ పండుగలకు ముందు సరోజినీ నగర్, పహార్‌గంజ్, గోవింద్‌పురిలలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. 2011లో ఢిల్లీ హైకోర్టు గేట్ నంబర్ 5 వెలుపల జరిగిన భారీ పేలుడులో అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
2008లో ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ వంటి కీలక వాణిజ్య ప్రాంతాల్లో ఒకదాని వెనుక ఒకటిగా జరిగిన పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2010లో జామా మసీదులో విదేశీ పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో పలు వాహనాలు ధ్వంసం కావడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి ముప్పు ఉందన్న వార్త ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతం డీడీయూ మార్గ్ పరిసరాల్లోని అణువణువూ గాలిస్తూ, అనుమానిత వ్యక్తులపై అధికారులు నిఘా పెంచారు.
