Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్

  • జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ బాస్‌కు ప్రమోషన్
  • అదనపు డీసీపీ పోస్టు అప్పగింత
Vivk

Vivk

అక్టోబర్ 3న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కానీ కొద్ది రోజులకే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏసీపీగా ఉన్న వివేక్ భగత్‌కు ప్రమోషన్ లభించింది. అదనపు డీఎస్పీగా పదోన్నతి లభించింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివేక్ భగత్ ప్రస్తుతం కనాట్ ప్లేస్ ఏసీపీగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 5న ఢిల్లీ హోం డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆయనతో పాటు మరో 11 మంది DANIPS అధికారులకు కూడా అదనపు డీసీపీ పోస్టుకు ప్రస్తుత బాధ్యతలు అప్పగించారు. ఈ ఏర్పాట్లు తాత్కాలికమైనవని, రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు మాత్రమే కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిరసనలో ఆరోపణలు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3న జంతర్ మంతర్ దగ్గర నిరసన జరిగింది. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో అవకతవకలు జరిగాయంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన సందర్భంగా ముగ్గురు మహిళా జర్నలిస్టులు పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వారిలో ఓ జర్నలిస్టు ఏసీపీ వివేక్ భగత్‌పై కూడా ఆరోపణలు చేసింది. ఈ ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులు నిష్పక్షపాత దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. మహిళా జర్నలిస్టులు చేసిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని సమాచారం. క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుదారులతో పాటు సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు అందుబాటులో ఉన్న వీడియో, సీసీటీవీ ఆధారాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీపీ వివేక్ భగత్‌కు అదనపు డీసీపీ బాధ్యతలు అప్పగించడంపై కొందరు కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాక్రోచ్ జంతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి పదోన్నతి ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

భగత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు, CJP సభ్యులు ఆదివారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళన చేపట్టారు. CPI(M) నేతలు బృందా కారత్, ఐషే ఘోష్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం పోలీసు అధికారులను కలిసేందుకు అనుమతి కోరింది. పోలీసు అధికారులు ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలను సమర్పించాలని కోరినట్లు సమాచారం. వివేక్ భగత్‌కు అప్పగించిన అదనపు డీసీపీ బాధ్యతలు ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నిర్ణయం కాదని, ఇది ముందుగానే ప్రారంభమైన సాధారణ ప్రక్రియలో భాగమని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాగే తాజా ఉత్తర్వుల్లో ఈ బాధ్యతలు తాత్కాలికమైనవేనని స్పష్టం చేశారు.