Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య

  • డెహ్రాడూన్‌లో దారుణం
  • ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’
  • వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
Dehradun2

Dehradun2

పెళ్లైన కొద్ది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘అమ్మా.. ఇలా వెళ్లిపోతున్నందుకు క్షమించు. ఆరు నెలలుగా అన్నీ భరిస్తున్నా. ఇక తట్టుకోలేకపోతున్నా. అత్తింటివారి మనస్తత్వం ఎప్పటికీ మారదు. పెళ్లి తర్వాత జరిగిన ప్రతిదానికీ నన్నే నిందిస్తూ.. నన్ను దురదృష్టవంతురాలిగా పిలుస్తున్నారు’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ ఆమె వీడియోలో చెప్పడం కలచివేస్తోంది.

మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సృష్టి కంధారీగా గుర్తించారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వ ఉద్యోగి అయిన సౌరభ్ రతూరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ డెహ్రాడూన్ నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోయివాలా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం సృష్టిని భర్త, అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి తర్వాత ఇంట్లో జరిగిన కొన్ని పరిణామాలకు కూడా సృష్టినే బాధ్యురాలిని చేస్తూ.. ఆమెను ‘‘దురదృష్టవంతురాలు’’, ‘‘అశుభం’’ అంటూ అవమానించేవారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వేధింపులు గత ఆరు నెలలుగా కొనసాగుతున్నాయని సమాచారం. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సృష్టి.. చివరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఆత్మహత్యకు ముందు సృష్టి సుమారు 90 సెకన్ల నిడివి గల వీడియోను రికార్డ్ చేసింది. వీడియో ప్రారంభమైన తర్వాత దాదాపు 35 సెకన్ల వరకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడింది.

‘‘సారీ అమ్మా.. నేను ఇలా వెళ్లిపోతున్నాను. అన్నీ చాలా విచిత్రంగా మారిపోయాయి. ఆరు నెలలుగా నేను ఇవన్నీ భరిస్తున్నాను. ఇక తట్టుకోలేకపోతున్నాను. వారి మనస్తత్వం ఎప్పటికీ మారదు. పెళ్లి తర్వాత జరిగిన విషయాలన్నింటికీ నన్నే నిందిస్తున్నారు. నన్ను ఎప్పుడూ దురదృష్టవంతురాలు అంటూ పిలుస్తున్నారు’’ అని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.

బుధవారం సృష్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి భర్త సౌరభ్ రతూరి, అత్త పార్వీనా, ఆడపడుచు చారు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కట్న వేధింపులు, కట్న మరణానికి సంబంధించిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దోయివాలా సర్కిల్ ఆఫీసర్ వందనా వర్మ మాట్లాడుతూ.. ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించిందని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. అత్తింటివారి వేధింపుల కారణంగానే తన కుమార్తె తీవ్ర మానసిక వేదనకు గురైందని మృతురాలి తల్లి ఫిర్యాదులో ఆరోపించినట్లు పేర్కొన్నారు.

సృష్టికి పెళ్లై కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయ్యిందని పోలీసులు తెలిపారు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. ఆమె భర్త కూడా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.