Hamoon Cyclone: తూర్పు తీరానికి తుఫాన్ ప్రమాదం పొంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత దీనికి ‘హమూన్’గా పిలుస్తారు. ఈ పేరును ఇరాన్ పెట్టింది. ఆదివారం రాత్రి ఈశాన్య దిశగా కదిలిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది. ఇది ఒడిశాలోని పారాదీప్ నుంచి 400 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్ లోని దిఘాకు నైరుతి దిశలో 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Read Also: Israel War: హమాస్‌కు మరో దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఆర్టిలరి గ్రూప్ డిప్యూటీ హెడ్ మృతి
రాబోయే 12 గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ.. అక్టోబర్ 25 సాయంత్రం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారి బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, చిట్టగాండ్ మధ్య దాటే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ లో తెలిపింది. ఇప్పటికే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అప్పమత్తం అయింది. జిల్లాల కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు అందాయి. దీని ప్రభావంతో సోమవారం నుంచి ఒడిశా తీర్పరాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
కియోంజర్, మయూర్‌భంజ్ మరియు ధెంకనల్‌తో పాటు ఉత్తర మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మత్స్యకారులు లోతైన సముద్రాల్లోకి వెళ్లవద్దని మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దుర్గాపూజ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించింది.