NTV Telugu Site icon

Aadhaar cards: ఆధార్ అలర్ట్.. అప్‌డేట్‌కి చివరిరోజు ఎప్పుడంటే..!

Aadhaar

Aadhaar

భారతదేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం అయింది. దేనికైనా ఆధార్ కార్డే అడుగుతున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు. ఆధార్ కార్డుకు ఎంత విలువ ఉందో. అయితే ఆధార్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ సమాచారం మీకోసమే.

ఆధార్‌ కార్డు తీసుకుని అప్‌డేట్‌ చేయనివారి ఆధార్ కార్డులు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఆధార్‌ కార్డులను గడువులోపు అప్‌డేట్‌ చేసుకోవల్సిన అవసరం ఉంది. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉచిత ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. ‘‘MyAadhaar’’ పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. లేదంటే రద్దయ్యే అవకాశాలున్నాయి. పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువు కూడా దగ్గర పడుతోంది. దీన్ని పొడిగిస్తుందో లేదో తెలియదు. కాబట్టి అప్‌డేట్ చేసుకుంటే మంచిది.

అప్‌డేట్‌కు అవసరమైన పత్రాలు
రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్‌ కార్డ్, సీజీహెచ్‌ఎస్‌ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో అప్‌డేట్ చేసుకోవచ్చు. ‘‘MyAadhaar’’ పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయాలి. సర్వీస్‌ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు.

Show comments