Dalai Lama’s New Address: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నివాసం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని అత్యంత ప్రముఖ ప్రాంతమైన లూటియన్స్ ఢిల్లీలో ఆయన కార్యాలయానికి ప్రభుత్వ బంగ్లాను కేటాయించింది. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లో ఉన్న ఈ బంగ్లాను దలైలామా కార్యాలయమైన ‘గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’కు కేటాయించినట్లు సమాచారం. విదేశాంగ శాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ కేటాయింపుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
దలైలామా కార్యాలయ నిర్వహణ కోసం పనిచేస్తున్న గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు ఈ ప్రభుత్వ నివాసాన్ని కేటాయించినట్లు సమాచారం. విదేశాంగ శాఖ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, దాని ఆధారంగా లూటియన్స్ ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతంలో బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. దలైలామాకు సంబంధించిన అధికారిక కార్యకలాపాలు, కార్యాలయ నిర్వహణకు ఈ నివాసం ఉపయోగపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వ నివాసాలను సాధారణంగా మూడేళ్ల కాలానికి కేటాయిస్తుంది. అవసరాన్ని బట్టి గడువును పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే దలైలామా కార్యాలయానికి కేటాయించిన బంగ్లా విషయంలో ఎంతకాలం అనుమతి ఇచ్చారు? ఎప్పటి నుంచి ఈ కేటాయింపు అమల్లోకి వస్తుంది? అనే విషయాలపై అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది.
గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ అంటే ఏమిటి?
గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ అనేది దలైలామాకు సంబంధించిన సంస్థ. దలైలామా ఆధ్యాత్మిక, మానవతా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. మానవ విలువలను ప్రోత్సహించడం, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, టిబెట్ సంస్కృతి, సంప్రదాయాలు, గుర్తింపును పరిరక్షించడం వంటి కార్యక్రమాల్లో ఈ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం వంటి కార్యక్రమాలకు కూడా ఈ సంస్థ సహకరిస్తుంది.
1959లో భారత్‌కు వచ్చిన దలైలామా
1959లో చైనాలో టిబెట్‌పై నియంత్రణ, తిరుగుబాటును అణచివేసే చర్యలు తీవ్రతరం కావడంతో దలైలామా టిబెట్‌ను విడిచి భారత్‌కు వచ్చారు. హిమాలయ పర్వత మార్గాల గుండా ప్రయాణించి భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సమీపంలోని మెక్లియోడ్ గంజ్‌లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ‘చిన్న లాసా’ అని కూడా పిలుస్తారు. అక్కడి నుంచే ఆయన ఆధ్యాత్మిక, మానవతా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. న్యూఢిల్లీలోనూ ఆయనకు అధికారిక కార్యాలయం ఉంది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
అహింస, ప్రపంచ శాంతి, మానవతా విలువల కోసం కృషి చేసిన దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2011లో తన రాజకీయ అధికారాలను టిబెట్ ప్రవాస ప్రభుత్వానికి అప్పగించిన ఆయన, ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచవ్యాప్తంగా కరుణ, శాంతి, సోదరభావ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు.

