
కరోనా మొదటి దశలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. వలసకూలీలు వందలాది కిలోమీటర్ల మీద నడిచి స్వస్థలాలకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి వలస కూలీలు నగరం బాట పట్టారు. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ మహమ్మారి ఉదృతి భీభత్సంగా ఉంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల రేటు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఢిల్లీలోని వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఘజియాబాద్ లోని టెర్మినల్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మామూలు సమయంలో రూ. 200 ఉండే ఛార్జ్, ఇప్పుడు ఏకంగా రెండు నుంచి నాలుగు వేలకు పెంచి ట్రావెల్స్ వసూలు చేస్తున్నాయి. కూలీపనులపై ఆధారపడి జీవనం సాగించే వలస కూలీలపై కరోనా పంజాతో పాటుగా ఇప్పుడు ట్రావెల్స్ కూడా బాదుడు తోడవ్వడంతో వలసకూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బులు లేక మళ్ళీ నడకబాట పడుతున్నారు.