Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!

  • గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుఫాన్..
  • నవంబర్ 20న ఏపీ తీరాన్ని తాకే అవకాశం..
  • నెమ్మదిగా కదిలే తుఫానులతో డేంజర్ అంటున్న శాస్త్రవేత్తలు..
Cyclone Akvan

Cyclone Akvan

Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ (Cyclone Akvan) నెమ్మదిగా కదులుతోంది. ఇటీవల వచ్చని అర్నాబ్, మురాసు తుఫానులతో పోలిస్తే దీని కదిలే వేగం తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సాధారణంగా తుఫానులు వేగంగా, నెమ్మదిగా కదలడం దాని విధ్వంసక శక్తిని నేరుగా నిర్ణయించదు. కానీ తుఫాను నెమ్మదిగా కదలడం వల్ల ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు వర్షాలు కురిసి ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుఫాన్ తాకే అవకాశం ఉంది. ఏపీతో పాటు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుంది.

నెమ్మదిగా కదలడం ప్రమాదమా..?

తుఫానులు వేగంగా, నెమ్మదిగా కదలడంపై వాతావరణ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. 2021లో ‘జర్నల్ ఆఫ్ హైడ్రోమెటియరాలజీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనం 2010 నుంచి 2019 మధ్య తీరాన్ని దాటిని 280 ఉష్ణమండల తుపానులను పరిశీలించింది.

ఈ తుఫానులు అవి కదిలే వేగానికి, దీని ద్వారా సంభవించిన వరదల తీవ్రతకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నెమ్మదిగా కదిలే తుఫానులు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ సేపు వర్షం పడేందుకు కారణమవుతాయి. తుఫాను తీరం దాటాకా మరో ప్రాంతానికి త్వరగా వెళ్లిపోకుండా ఎక్కువసేపు ఒకే ప్రాంతంలో కొనసాగడం వల్ల భారీ వర్షాలు పడి, వరదలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

వేగంగా కదిలే తుఫానుల్లో వర్షపాత ఎక్కువనా..?

ఇదిలా ఉంటే, 2022లో నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2001 నుంచి 2020 మధ్య ఉపగ్రహాల ద్వారా సేకరించిన వర్షపాత సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఉష్ణమండల తుపానులు ముందుకు కదిలే వేగం పెరిగే కొద్దీ వాటిలో సగటు వర్షపాతం రేటు కూడా పెరిగింది. వేగంగా కదిలే తుపానుల్లో సగటున వర్షపాతం రేటు, నెమ్మదిగా కదిలే తుపానులతో పోలిస్తే 24 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది.

వరసగా మూడు తుఫానులు, ఎల్ నినో కారణమా..?

ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) ప్రకారం..ఆగస్టులో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో వాతావరణ దృగ్విషయం మరింత బలపడింది. డిసెంబర్ నాటికి ఇది అత్యంత బలమైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం గతంతోనూ ఆంధ్రప్రదేశ్‌లో తుఫానుల సంఖ్యపై కనిపించింది. 1976, 1987 సంవత్సరాల్లో ఒక్క నెల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ మూడు తుపానులను ఎదుర్కొంది. ఆ రెండు సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంలో ఉంది.