Corona Cases In India: భారతదేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతంలో 15 వేలకు పైగా నమోదైన కేసులు సంఖ్య క్రమంగా పదివేల లోపే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 26 మంది మరణించారు. ఒక్క రోజులో 8,414 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు చేరింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55,114 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.69 శాతానికి చేరింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉంది.
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 4,44,56,535 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 4,38,65,016 కోలుకోగా.. 5,27,991 మంది మరణించారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం కూడా విస్తృతంగా సాగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ వల్లే ఇండియాలో సెకండ్ వేవ్ తరువాత మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు ఇండియాలో అర్హులైన వారికి 213.20 కోట్ల వ్యాక్సినేషన్ డోసులును ఇచ్చారు. శనివారం ఒక్క రోజే 19,35,814 మందికి టీకాలను ఇచ్చారు. 3,20,820 మందికి కరోనా టెస్టులు చేశారు.
Read Also: Geetha Murthy: డ్రగ్స్‌లో, విమెన్ ట్రాఫికింగ్‌లో తెలంగాణ నంబర్ వన్
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కొన్ని దేశాల్లో పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రష్యాలో కూడా గణనీయంగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి రష్యాలో 50 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. జపాన్ లో కొత్తగా 1,35,425 కేసులు నమోదు అయ్యాయి. దక్షిణ కొరియాలో 79,623 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కరోనాతో ప్రపంచంలో ఇప్పటి వరకు 60,98,10,008 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 65,02,493 మంది మరణించగా.. 58,61,69,762 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
