దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా నిబంధనలను అమలు చేశాయని… ఇంకా చేస్తున్నాయని.. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో నిబంధనలను మరింతకాలం పొడిగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. మార్చి 31తో ప్రస్తుతం ఉన్న కరోనా ఆంక్షల గడువు ముగుస్తుందని.. ఆ తర్వాత హోంశాఖ ఎటువంటి కొత్త ఆదేశాలు జారీ చేయదని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ తీరు ఎప్పుడు, ఎలా ఉంటుందో చెప్పలేమని.. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
