Actor Vijay: తమిళనాడులో యాక్టర్ విజయ్ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన తొలి రాష్ట్రస్థాయి సభకు దాదాపుగా 8 లక్షల మంది ప్రజలు తరలి రావడం చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా విజయ్‌పై ఇటు అధికార డీఎంకే, అటు ప్రతిపక్ష ఏఐడీఎంకే రెండూ కూడా విమర్శలు మొదలుపెట్టాయి.
తాజాగా, విజయ్ తమ ఐడియాలజీని కాపీ కొట్టారని డీఎంకే అధికార ప్రతినిధి ఇలంగోవన్ అన్నారు. విజయ్ చెప్పినవన్నీ ఇప్పటీకే మా డీఎంకే పార్టీ చెప్పిందని, మేము అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష ఏఐడీఎంకే విజయ్ ఐడియాలజీ ‘‘కాక్‌టెయిల్’’ అంటూ విమర్శలు గుప్పించింది.
Read Also: Akali Dal: అకాలీదళ్‌కి బూస్ట్.. సిక్ ప్యానెల్ ఎన్నికల్లో విజయం..
అంతకుముందు, సభలో విజయ్ మాట్లాడుతూ.. ద్రవిడియన్ మోడల్ పేరు, ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని డీఎంకే అధినేత స్టాలిన్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. అండర్ హ్యాండ్ డీలింగ్ ద్వారా ఒక కుటుంబం రాస్ట్రాన్ని లూటీ చేస్తుందని ఆరోపించారు. సాంఘిక న్యాయం మరియు మహిళా సాధికారతపై ద్రావిడ ఐకాన్ పెరియార్ విధానాన్ని తమ పార్టీ అనుసరిస్తుందని విజయ్ చెప్పారు. మేము పెరియార్‌లా దేవుడు లేడనే స్టాండ్ తీసుకోము, మేము ఎవరి విశ్వాసాలకు వ్యతిరేకం కాదని చెప్పారు.
అయితే, విజయ్ పార్టీ గురించి డీఎంకే అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల కోసం పోరాడటానికి పార్టీలను నిర్మిస్తారని, అయితే, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండేళ్లలోనే అధికారంలోకి రావాలని విజయ్ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. డీఎంకే నాయకులు కాకుండా టీవీకే నాయకులు జైలుకు వెళ్లి ప్రజల కోసం పోరాడరని, డీఎంకేకి ఇతర పార్టీలకు ఉన్న తేడా అదే అని, మేం బలంగా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం ఉన్నామని అతను అన్నారు.