Site icon NTV Telugu

Cooking Oil Prices: కేంద్రం కీలక నిర్ణయం… దిగిరానున్న వంటనూనెల ధరలు

Edible Oil 1280

Edible Oil 1280

పెరుగుతున్న ద్రవ్యోల్భనానికి అడ్డుకట్ట వేసేందుకు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్ , డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెరుగుతున్న ఇంధన రేట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్రం కాస్త ఉపశమనం కలిపించింది. కేంద్రం బాటలోనే కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు వ్యాట్ ను కూడా తగ్గించాయి.

ఇదిలా ఉంటే వరసగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏడాది 20 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీతో పాటు వ్యవసాయ మౌళిక అభివృద్ధి సెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. 2022-23, 2023-24 రెండు ఆర్థిక సంవత్సరాలకు ఈ రద్దు వర్తించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే మార్చి 31, 2024 వరకు మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై సుంకాలను లేకుండా దిగుమతి చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల ఆయిల్ రేట్లు భారీగా దిగివచ్చే అవకాశం ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయల్ పెద్ద ఎగుమతిదారుగా ఉన్న ఉక్రెయిన్ యుద్ధంలో ఉండటం వల్ల డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఇండోనేషియా ప్రభుత్వం కూడా పామాయిల్ ఎగుమతిపై బ్యాన్ ఎత్తేసింది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న దిగుమతి సుంకం రద్దు నిర్ణయాలతో రానున్న రోజుల్లో ఇండియాలో వంటనూనెల ధరలు భారీగా దిగిరానున్నాయి. సామాన్యుడిపై భారం తగ్గే అవకాశం ఏర్పడింది.

Exit mobile version