CJP Protest: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీళ(సీజేపీ) నిరసనలు కొనసాగుతున్న వేళ కీలక ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కన్నాట్‌ప్లేస్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6.30 గంటలలోపు దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(NDMC) సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లతో టెలిఫోన్ సంప్రదింపుల తర్వాత ఈ ఆదేశాు జారీ చేసినట్లు ట్రేడర్ అసోసియేషన్ చెప్పింది. వ్యాపారులు తమకు సహకరించి సాయంత్రం 6.30గంటల్లోపు తమ దుకాణాలు మూసేయాలని కోరింది. అవాంఛనీయ ఘటనలు, ఆస్తికి నష్టం లేదా వ్యక్తిగత గాయాలు నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NDTA అధ్యక్షుడు అతుల్ భార్గవ చెప్పారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ చర్యలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. భద్రతా బలగాల మోహరింపు, అంబులెన్సుల ఏర్పాటు నేపథ్యాన్ని ప్రశ్నించారు. విద్యార్థులపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతుందా? అని అడిగారు. మరోవైపు, ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం(NSA) కింద ఢిల్లీ పోలీసులకు అపరిమిత అధికారాలు ఇచ్చింది. ఈ చట్టం కింద వ్యక్తుల్ని అరెస్ట్ చేసే అధికారం లభిస్తుంది. ప్రస్తుత ఉత్తర్వులు జూలై 7న జారీ అయ్యాయని, జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రతీ 3 నెలలకొకసారి వీటిని పొడగించవచ్చు.

