Site icon NTV Telugu

PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంగా వాడుకుంది.

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంగా ఉపయోగించుకుందని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. శుక్రవారం ఆయన నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మాత్రం 8 ఈశాన్య రాష్ట్రాలను ‘‘ అష్ట లక్ష్మీ’’లుగా భావిస్తోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధికి ‌కృషి చేస్తోందని అన్నారు. దిమాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నాగాలాండ్ లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఎన్డీయే ప్రభుత్వ కృషి చేస్తోందని అన్నారు. దీని కోసమే 1958 నుంచి కొనసాగుతున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తేశామని అన్నారు.

Read Also: Medico Prethi: కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఘటన పూర్తి వివరాలు.. ఎవరెవరు ఏమన్నారంటే..

తమ సొంత ప్రజలను నమ్మకుండా, గౌరవించకుండా, సమస్యలను పరిష్కరించకుండా దేశాన్ని నడపలేమని.. ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు ఉండేవని అన్నారు. ఇప్పుడు బీజేపీ మంచి పాలన అందిస్తోందని.. బీజేపీ ప్రజలను మతం, ప్రాంతం ఆధారంగా విభజన చూపదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నాగాలాండ్ లో రాజకీయ అస్థిరత ఉందని, ఢిల్లీ నుంచి ఈశాన్య రాష్ట్రాలను రిమోట్ ద్వారా నియంత్రించిందని మోదీ విమర్శించారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు రాజవంశ రాజకీయాలను నడిపిందని అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) నాగాలాండ్ ను నడపడానికి మూడు సూత్రాలను అవలంభిస్తోందని అన్నారు. శాంతి, పురోగతి, శ్రేయస్సు అనే మూడు మంత్రాల ద్వారా నాగాలాండ్ ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ అవినీతికి చెక్ పెట్టిందని.. ఫలితంగా ఢిల్లీ నుంచి వచ్చే డబ్బుల నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు.

Exit mobile version