ఇటీవల ఓ మీడియా సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ప్రధానమంత్రి రేసులోకి వచ్చారు. అప్పటి నుంచి టీవీకే నేతలు.. భవిష్యత్ ప్రధానమంత్రిగా విజయ్‌ను ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తీసుకొచ్చాయి. 2029లో రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి రేసులో ఉంటారని.. అలా అంగీకారమైతేనే ప్రభుత్వంలో ఉంటామని విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరించింది.
తాజాగా మరోసారి ఈ వ్యవహారం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ముందుగా ముఖ్యమంత్రిగా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ సూచించారు. ఈ వారం ప్రారంభంలో విజయ్‌ను కలిసిన ఠాగూర్.. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌కు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల నుంచి విజయ్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని అవినీతి రహిత పాలన అందిస్తూ అద్భుతమైన ముఖ్యమంత్రిగా ఎదగాలని సూచించారు.
‘అద్భుతమైన సీఎం అవ్వాలి’
“విజయ్‌కు పెద్ద సంఖ్యలో ప్రజల మద్దతు లభించింది. కమిషన్లు లేకుండా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తూ ఆయన అద్భుతమైన ముఖ్యమంత్రిగా ఎదగడానికి కృషి చేయాలి” అని ఠాగూర్ గురువారం వ్యాఖ్యానించారు. విజయ్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలంటూ టీవీకేకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఠాగూర్ ఈ సూచనలు చేశారు. టీవీకే నేతల నుంచి విజయ్‌ను 2029లో ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలనే వ్యాఖ్యలు ఇటీవల వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడు ఆహార శాఖ మంత్రి, టీవీకే కోశాధికారి పి. వెంకటరమణన్ ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్నది అధికారిక డిమాండ్ కాదని.. వ్యక్తిగత కోరిక మాత్రమేనని ఆయన అన్నారు.
కాంగ్రెస్ వైఖరిలో మార్పు లేదు
మరోవైపు 2029 ప్రధాని అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ తన అధికారిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో లేదా విస్తృత కూటమిలో ఎలాంటి గందరగోళం లేదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత తారాహై కుత్‌బర్ట్ తెలిపారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె.. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ కొందరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగత ఉత్సాహానికి సంబంధించినవేనని చెప్పారు. విజయ్ కూడా గతంలో రాహుల్ గాంధీనే కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్నట్లు అంగీకరించారని ఆమె గుర్తు చేశారు.

