Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమైంది. తాజాగా ఆ పార్టీ తన పోల్ మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ మేనిఫెస్టో రైతులు, యువత, మహిళలకు పెద్ద పీట వేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. దేశంలో అన్ని వర్గాలతో మాట్లాడాకే మేనిఫెస్టోని రూపొందించినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని, 30 లక్షల ఉద్యోగ ఖాళీలనున భర్తీ చేస్తామని, క్యాష్ లెస్ రూ. 25 లక్షల ఇన్సూరెన్స్‌ని దేశవ్యాప్తంగా తీసుకువస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Read Also: Supreme court: యూపీ మదర్సా చట్టం కేసులో కీలక తీర్పు
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ‘అబద్ధాల మూట’గా అభివర్ణించింది. దేశాన్ని దశాబ్ధాలుగా పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫేస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకే కాంగ్రెస్ ఇలాంటి ఎన్నికల హామీలను రూపొందించినట్లు ఆరోపించారు. దేశాన్ని దశాబ్ధాలుగా పాలించిన కాంగ్రెస్ నేడు ‘న్యాయం’ గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.
మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఉన్న ఫోటోలు కూడా ఈ దేశానివి కావని ఆయన అన్నారు. మేనిఫేస్టోలో నీటి నిర్వహణపై ఒక చిత్రం ఉందని, ఇది న్యూయార్క్‌లోని బఫేలో నదికి సంబంధించిందని, ఇక పర్యాటక విభాగం కింద ఉన్న ఫోటో రాహుల్ గాంధీకి ఎంతో ఇష్టమైన డెస్టినేషన్ థాయ్‌లాండ్‌కి చెందిందంటూ ఆరోపించారు.
