NTV Telugu Site icon

Congress Party President: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టకపోతే ఎవరికి ఛాన్స్‌?

Congress Party President

Congress Party President

Congress Party President: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఈ ప్రక్రియ పూర్తికావాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమి తర్వాత రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి(మూడేళ్లుగా) సోనియా గాంధే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతారా లేక మరెవరైనా తెర మీదికి వస్తారా అనేది అర్థంకావట్లేదు.

పార్టీ చీఫ్‌గా మరోసారి వ్యవహరించేందుకు రాహుల్‌ గాంధీ ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. పదవి నుంచి వైదొలిగినప్పుడే ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా ఇంకోసారి పగ్గాలు చేపట్టబోమని తేల్చిచెప్పారు. కానీ రాహుల్‌ గాంధీ అలా అన్న కొద్ది రోజులకే ఆయన తల్లి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలను స్వీకరించారు.

Priyanka Gandhi Vadra: ప్రియాంకా గాంధీకి కోవిడ్… రాహుల్ గాంధీకి అనారోగ్యం

కాబట్టి ఇప్పుడు కూడా చివరి నిమిషం దాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదని గాంధీ కుటుంబ సన్నిహితులు సైతం పేర్కొంటున్నారు. భారత్‌ జోడో యాత్రను లీడ్‌ చేస్తానని చెబుతున్న రాహుల్‌ గాంధీ పార్టీ హైకమాండ్‌గా మాత్రం ఉండబోనని పదే పదే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్ష పదవి అధిరోహించాలని కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

సోనియా గాంధీ తాత్కాతిక అధ్యక్షురాలు కాకముందే రికార్డ్‌ స్థాయిలో 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాహుల్‌ గాంధీ ఏడాదిన్నరకు పైగా అధ్యక్షుడిగా పార్టీని నడిపారు. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ (నలుగురి) మొత్తం పదవీ కాలంతో పోల్చినా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలే (ఇద్దరే) ఎక్కువ కాలం ప్రెసిడెంట్‌ పోస్టులో ఉండటం గమనార్హం.

అయినప్పటికీ మరోసారి గాంధీ కుటుంబీకులే (ప్రియాంక గాంధీ వాద్రా సహా ఎవరైనా ఒకరు) అధ్యక్ష హోదాలో ఉండాలని విజ్ఞప్తి చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. ఒక వైపు అధికార పార్టీ బీజేపీ నేతలు వారసత్వ, కుటుంబ రాజకీయాల పేరుతో కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారు. మరో వైపు 2024 జనరల్‌ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. దీంతో గాంధీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు అధ్యక్ష కుర్చీలో కూర్చోకపోతే కష్టమని కేడర్‌ మొత్తం భావిస్తోంది.

రాహుల్‌ గాంధీ ససేమిరా అంటుండటంతో ఆయన కుటుంబానికి సన్నిహితంగా, విధేయులుగా ఉండే కొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న పలువురి పేర్లు, సామాజికంగా వెనకబడ్డ వర్గాల్లోని కొందరు నాయకుల పేర్లు పార్టీ అధ్యక్ష పదవికి అడపాదడపా వినిపిస్తున్నాయి. కానీ అవి వాస్తవ రూపం దాల్చే సూచనలు కనిపించట్లేదంటూ రాజకీయ పరిశీలకులు కొట్టిపారేస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ ఆఖరి నిమిషంలోనూ ఒప్పుకోకపోతే ప్రెసిడెంట్‌ ఎలక్షన్‌ మరింత ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తున్నారు.