Congress Opposes Inclusion Of “Non-Locals” In Jammu-Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులను ఓటర్లగా ఓటర్ జాబితాలో చేర్చడాన్ని కాశ్మీరీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ అంశంపై తమ నిరసనను తెలియజేశాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థానికేతరులకు ఓటుహక్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఓటు వేసేందుకు అనుమతించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
ఇదిలా ఉంటే ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి హజరుతామని కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ రజినీ పాటిల్ తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మేము న్యాయపరంగా పోరాడుతామని.. పిల్ దాఖలు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ తరుపున జమ్మూ కాశ్మీర్ పీసీసీ చీఫ్ వికార్ రసూల్ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారని తెలిపారు.
Read Also: TRS Munugodu Sabha : అభ్యర్థిని ప్రకటించకుండానే ముగిసిన కేసీఆర్ ప్రసంగం
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో జనాభా స్వరూపాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. కాశ్మీర్ పార్టీలు, మహబూబా ముఫ్తి, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పాకిస్తాన్ కూడా స్పందించింది. భారత్ ఎన్నికల పేరుతో కాశ్మీర్ జనాభాను మార్చాలని చూస్తోందని పాక్ విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు 25 లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యే అవకాశం ఉందని జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి హిర్దేష్ కుమార్ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లో పనికోసం వచ్చి.. ఇక్కడ నివసించే వారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయవచ్చని ఆయన అన్నారు.