NTV Telugu Site icon

Haryana polls: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై ఉచిత వరాల జల్లులు

Haryanapolls

Haryanapolls

హర్యానా ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఎంఎస్‌పీ హామీ, కుల గణన వంటి వాగ్దానాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.

90 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో శనివారం భారీ మేనిఫెస్టో విడుదల చేసింది.

హామీలు ఇవే..
ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
18-60 ఏళ్ల మహిళలకు రూ.2000 ఆర్థిక సాయం
రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేత
రైతులకు (ఎంఎస్‌పీ) పంటలకు కనీస మద్దతు ధర హామీ
తక్షణ నష్టపరిహారం కోసం చట్టపరమైన హామీ
రైతు కమిషన్ ఏర్పాటు.. డీజిల్‌పై రాయితీ
పేదలకు 200 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు
కులాల వారీగా సర్వే నిర్వహిస్తామని హామీ
క్రీమీ లేయర్ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు
యువతకు 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు
రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని హామీ

కేంద్రానికి విరుద్ధంగా పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేందుకు బుధప పెన్షన్, దివ్యాంగ్ పెన్షన్ మరియు విధ్వా పెన్షన్ కింద సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మరియు వితంతువులకు వరుసగా రూ. 6000 ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. హామీలు అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. 2019లో బీజేపీ 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 30 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.

Show comments