దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం.. ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. ఇంకోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ కీలకమైన అభ్యర్థిని ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేసే అభ్యర్థిని శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం అతిషిపై కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబాను ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి అల్కా లాంబాను పోటీకి దింపినట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబా అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించినట్లు పేర్కొంది. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న అల్కా లాంబా గతంలో అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి విఫలమయ్యారు. అయితే కల్కాజీ నుంచి పోటీ చేసేందుకు అల్కా లాంబా ఆసక్తిగా లేరని వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గత రెండు సార్లు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం విశేషం. అంతేకాదు.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ జీరో సీట్లు సాధించింది. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత అతిషి ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాదు… ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా అతిషినే కావడం విశేషం.
49 ఏళ్ల అల్కా లాంబా.. 19వ ఏటలో 1994లో కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆమె ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో గెలిచారు. 2013లో కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. రెండు సంవత్సరాల తర్వాత చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో విజయం సాధించారు. అనంతరం 2019లో ఆమె ఆప్‌ని విడిచిపెట్టి.. తిరిగి మాతృ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరారు.