NTV Telugu Site icon

Congress: “ఇక అధిష్టానం నిర్ణయమే”.. సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం..

Karnataka

Karnataka

Congress: కర్ణాటక ఎన్నికలు ముగిసినా.. కాంగ్రెస్ భారీ విజయం సాధించినా.. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం బెంగళూర్ లోని షాంగ్రీల్లా హోటల్ కేంద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలు జైరాంరమేష్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్ పరిశీలకులుగా ఉన్నారు.

Read Also: Himanta Biswa Sarma: ఒక్కదానికే కాంగ్రెస్ ఇంత ఓవరాక్షనా..? ఇటువంటివి మేం మస్త్ చూసినం..

అయితే తదుపరి సీఎం ఎవరనే నిర్ణయాన్ని సీఎల్పీ కాంగ్రెస్ అధిష్టానానికే వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించాలని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం లోపు కొత్త సీఎం ఎవరనేది తేలుతుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే డీకే శివకుమార్, సిద్దరామయ్య అభిమానులు, మద్దతుదారులు సమావేశం జరుగుతున్న షాంగ్రీలా హోటల్ ముందు ఆందోళన చేశారు. తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. సీఎం పదవి తమ నేతకే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు రణదీప్ సుర్జేవాలా డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో భేటీ అయ్యారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీయేతర, భావసారుప్యత కలిగిన పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చూస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 224 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 135 సీట్లను గెలుచుకుంది. దీంతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో బలం 137కు చేరింది. ఇక బీజేపీ 66 స్థానాల్లో, జేడీఎస్ 19 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే.