Site icon NTV Telugu

Bihar Elections: 16 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఆర్జేడీతో కలిసి పోటీ లేనట్లే!

Bihar Elections 20251

Bihar Elections 20251

నిన్నామొన్నటి దాకా ఓటర్ యాత్ర పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి బీహార్ అంతటా తిరిగాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కలలు కన్నాయి. కానీ చివరికి అంతా తుస్ మనిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.. ఓ వైపు నామినేషన్లు వేస్తున్నారు. ఇంకోవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇండియా కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ మాత్రం తెగలేదు. ఢిల్లీకి వెళ్లిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. సీట్ల పంపకాలు తేలకుండానే తిరుగుటపా అయ్యారు. ఆగమేఘాల మీద రఘోపూర్‌లో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తేజస్వి యాదవ్ అలా నామినేషన్ వేశారో లేదో.. కొద్ది సేపటికి 16 మందితో కూడిన అభ్యర్థులను కాంగ్రెస్ కూడా ప్రకటించేసింది. దీంతో ఇండియా కూటమి బీటలు వారాయని తేలిపోయింది. కలిసి పోటీ చేయడం లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: Durgapur Student Rape: మమత ‘తల్లి’లాంటిది.. సీఎంకు క్షమాపణ చెప్పిన బాధితురాలి తండ్రి

ఔరంగాబాద్ నుంచి ఆనంద్ శంకర్ సింగ్, రాజపకడ్ నుంచి ప్రతిమా దాస్, బచ్వార్ నుంచి శివ ప్రకాశ్ గరీబ్ దాస్, బరాబిఘ నుంచి త్రిశూల్ధారి సింగ్, నలంద నుంచి కౌశలేంద్ర కుమార్, వసీర్‌గంజ్ నుంచి శశి శేఖర్ సింగ్, కుటుంబ నుంచి రాజేష్ రామ్, బెగుసరాయ్ నుంచి అమితా భూషణ్‌లను పార్టీ బరిలోకి దించింది.

అంతేకాకుండా అమర్‌పూర్‌ నుంచి జితేంద్ర సింగ్‌, గోపాల్‌గంజ్‌ నుంచి ఓం ప్రకాష్‌ గార్గ్‌, ముజఫర్‌పూర్‌ నుంచి విజేంద్ర చౌదరి, గోవింద్‌గంజ్‌ నుంచి శశిభూషణ్‌ రాయ్‌, రోస్డా నుంచి బీకే రవి, లఖిసరాయ్‌ నుంచి అమరేష్‌ కుమార్‌, సుల్తాన్‌గంజ్‌ నుంచి లాలన్‌ కుమార్‌, బిక్రమ్‌ నుంచి అనిల్‌కుమార్‌లు బరిలో నిలిచారు.

ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!

కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీహార్ యూనిట్ అధ్యక్షుడు రాజేష్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహాఘట్బంధన్ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ను అధికారం నుంచి తొలగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా.. 19 స్థానాల్లో విజయం సాధించింది.

 

Exit mobile version