ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఇక లేరన్న విషయాన్ని అభిమానులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆమె గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లత ఉదయం మరణించారు. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చిరంజీవి, నిర్మలా సీతారామన్, గౌతమ్ గంభీర్, మంచు విష్ణు, రేవంత్ రెడ్డి, సీఎం జగన్, సీఎం కేసీఆర్, సాయి థరమ్ తేజ్, బాలయ్య నివాళులర్పించారు.
‘‘లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హృదయాలను కలిచివేసింది. ఆమె పాటల్లో భారతదేశ గొప్పతనం, తత్వం వ్యక్తమయ్యేది. భారతరత్న లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివి. ఇలాంటి కళాకారులు శతాబ్దంలో ఒక్కరు జన్మిస్తారు. లతా దీదీ అసాధారణమైన మనిషి. నేను ఆమెను కలిసినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓ దివ్య స్వరం శాశ్వతంగా నిశ్శబ్దంలోకి వెళ్లినా.. ఆమె శ్రావ్యమైన స్వరాలు మాత్రం నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆమె కుటుంబ సభ్యులకు, ప్రపంచ నలుమూలలా ఉన్న ఆమె అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ – రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
‘‘లతా దీదీ మనల్ని విడిచి వెళ్లారు. నాలో బయటకు చెప్పలేని ఆవేదన. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె స్వరంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. రాబోయే తరాలు ఆమెను భారత సంస్కృతికి ప్రతినిధిగా స్మరించుకుంటారు. ఆమె పాటలు అనేక రకాల వ్యక్తీకరణలను వెలుగులోకి తెచ్చాయి. దశాబ్దాలుగా భారత చలనచిత్ర రంగంలో వచ్చిన మార్పులకు ఆమె సాక్షిగా నిలిచారు. ఆమె ఎప్పుడూ భారతదేశ వృద్ధిని కాంక్షించేవారు. అభివృద్ధి చెందిన బలమైన భారతదేశాన్ని చూడాలని ఆమె ఆకాంక్షించారు. లతా దీదీ నుంచి నేను ఎప్పుడూ ఆప్యాయమైన పలకరింపును పొందానని చెప్పడానికి గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో జరిపిన సంభాషణలు మరువలేనివి. ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి నా సానుభూతి వ్యక్తం చేశాను. ఓం శాంతి’’ – నరేంద్ర మోదీ, ప్రధాని
‘‘మంత్రముగ్ధుల్ని చేసే తన స్వరంతో లతా దీదీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీత మాధుర్యాన్ని నింపారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఆమె మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. లతా దీదీ ఆప్యాయత, ఆశీర్వాదాలను పొందిన నేను అదృష్టవంతుడిని. సాటిలేని దేశభక్తితో, మధురమైన మాటలతో, సౌమ్యతతో ఆమె ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆమె కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ – అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
‘‘లతా మంగేష్కర్ మరణించారన్న దుర్వార్త నన్ను కలచివేసింది. దశాబ్దాలుగా భారతదేశానికి ఆమె స్వరం అత్యంత ప్రియమైనది. అజరామరమైన ఆమె బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
‘‘లతా మంగేష్కర్ మరణం భారత దేశ సినీ సంగీత లోకానికి తీరని లోటు. 30 వేలకు పైగా హిందీ ఇతర భాషలలో పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’’-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధినేత
ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ మరణం మన భారత ప్రజలందరినీ తీవ్రంగా కలచి వేసింది. ఆమె మృతి దేశానికి తీరనిలోటు-జానారెడ్డి. కాంగ్రెస్ నేత
‘‘ఎనిమిది దశాబ్దాల పాటు తన పాట తో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ఆగిపోయింది’’-కేసీఆర్, తెలంగాణ సీఎం
లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనం. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే…అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయి. లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి-నందమూరి బాలకృష్ణ