Maldives: భారత్‌ని కాదని, చైనా అనుకూల వైఖరిని అవలంభిస్తున్నప్పటికీ, మాల్దీవులకు మన దేశం సాయం చేసింది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ఆ దేశానికి అవసరమైన నిత్యావరసరాలను భారత్ ఎగుమతి చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మాల్దీవులకు అవసరమైన వస్తువులను భారత్ సరఫరా చేసేందుకు అనుమతించింది. దీనిపై ఆ దేశ మంత్రి మూసా జమీర్ భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య చిరకాల స్నేహాన్ని, ద్వైపాక్షిక వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని మరింత విస్తరించాలనే బలమైన నిబద్ధతను తెలియజేస్తోందని జమీర్ పేర్కొన్నారు.
జమీర్ ఎక్స్ వేదికగా…‘‘ 2024-25 సంవత్సరంలో భారత్ నుంచి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి మాల్దీవుల కోటాను పునరుద్ధరించినందుకు EAM జైశంకర్ మరియు భారత ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీర్ఘకాల స్నేహం, మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి నిబద్ధతను సూచిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
Read Also: Bandi Sanjay: ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం
మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ‘‘ యు ఆర్ వెల్‌కమ్..మూసాజమీర్. భారతదేశం తన పొరుగు దేశాలు ఫస్ట్ అనే విధానానికి, సాగర్ విధానాలకు కట్టుబడి ఉంది’’ అని అన్నారు. భారత్ చుట్టు పక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఫస్ట్ అనే విధానాన్ని అవలంభిస్తోంది.
మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత్ 2024-25 ఆర్థిక్ సంవత్సరానికి గానూ మాల్దీవులకు 124,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 109,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 35,749 టన్నుల ఉల్లిపాయలు మరియు 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది. దీంతో పాటు 1 మిలియన్ టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేసేందుకు కూడా అనుమతించింది.
మాల్దీవులకు మహ్మద్ ముయిజ్జూ అధ్యక్షుడైన తర్వాత నుంచి ఆ దేశం చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తోంది. భారత్‌ని కాదని ముయిజ్జూ తన తొలి పర్యటన చైనాలో చేశారు. చైనాతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఇదే కాకుండా ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది.
