గత కొంత కాలంగా పెరుగుతూ పోతున్న సిలిండర్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ తో పాటు డోమెస్టిక్ సిలిండర్ పై ధర పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించాయి. శుక్రవారం, జూలై 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు రెండుసార్లు ఎల్ పీ జీ ధరలనున ప్రకటిస్తాయి. నెల ప్రారంభంలో ఒకసారి, నెల మధ్యలో ఒకసారి సిలిండర్ల ధరలను పెంచడం, తగ్గించడం చేస్తుంటుంది.
నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 198 తగ్గనుంది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ. 2,219 ఉండగా.. తగ్గిన ధరల కారణంగా ప్రస్తుతం ధర రూ. 2,021 అవనుంది. కోల్ కతాలో రూ.2,322 ఉండగా.. రూ. 2,140 కానుంది. ముంబై, చెన్నై నగరాల్లో రూ. 2,373 ఉన్న సిలిండర్ ధర రూ.2,186కు దిగి రానుంది. చివరి సారిగా మే 19న దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్ పీ జీ సిలిండర్ ధరలను పెంచారు.
