Co-working: కరోనా మహమ్మారి నేపథ్యంలో కో-వర్కింగ్ కల్చర్ ఇక కనుమరుగైనట్లే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనా తప్పు అని రుజువైంది. కలిసి పనిచేద్దాం రా అంటూ ఉద్యోగులు కో-వర్కింగ్‌కి జై కొడుతున్నారు. ఏక్ నిరంజన్‌లా ఒంటరిగా కూర్చొని చేసే వర్క్ ఫ్రం హోంతో తెగ బోర్ కొట్టి క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నారు. దీంతో ఆఫీసుల్లో కొవిడ్ ముందు నాటి పరిస్థితులు దాదాపు పూర్తి స్థాయిలో నెలకొన్నాయి. ఫలితంగా దేశం మొత్తమ్మీద కో-వర్కింగ్ స్పేస్‌లకు గిరాకీ పెరిగింది.
ఆఫీసుల్లో హైబ్రిడ్ మోడల్ పని వాతావరణాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్లా నిలవబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్గా ఓ రీసెర్చ్ రిజల్ట్స్ వెలువడ్డాయి. దాని ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయాల విస్తీర్ణం 34.1 మిలియన్ చదరపు అడుగులు. ఇందులో 13 శాతం వాటా(దాదాపు 4.43 మిలియన్ స్క్వేర్ ఫీట్)ను కో-వర్కింగ్ స్పేస్‌లు ఆక్రమించాయి. 2020-21లో ఇది కేవలం 5 శాతమే కావటం గమనార్హం.
అంటే ఏకంగా 8 శాతం వృద్ధిరేటు నమోదైందని చెప్పొచ్చు. ఇది అన్ని ఆఫీస్ సెగ్మంట్లలో అత్యధికం కావటం విశేషం. దీని తర్వాత సుమారు 4 శాతం వృద్ధిరేటుతో మ్యానిఫ్యాక్షనింగ్/ఇండస్ట్రియల్ సెక్టర్ నిలిచింది. ఇదే సమయంలో ఐటీ/ఐటీ అనుబంధ రంగాలు, ఇ-కామర్స్ రంగాల వృద్ధిరేటు వరుసగా 8 శాతం, 6 శాతం పడిపోయాయి. వ్యాపారాలు/ఉద్యోగుల కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే సౌకర్యాల వైపు (ఫ్లెక్సిబుల్ స్పేసెస్ దిశగా) పని వాతావరణం క్రమంగా మారుతోందనటానికి ఇదో నిదర్శమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం కో-వర్కింగ్ స్పేస్‌లో దగ్గరదగ్గరగా 50 శాతం స్పేస్ 0.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగినవే. మిడ్ సైజ్ ఆఫీస్‌లు కూడా 1 శాతం వృద్ధిని నమోదుచేశాయి. మొత్తం ఆఫీసు స్పేస్‌లో 58 శాతం వాటాను దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆక్రమించాయి. ఈ నగరాల్లో వర్క్ స్పేస్ ఆఫీసుల యావరేజ్ రెంట్ (ఒక నెలకి) ఒక చదరపు అడుగుకి 76 రూపాయలుగా ఉంది.