Yogi Adityanath: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం(ఎస్టీఎఫ్) ఈ రోజు ఎన్‌కౌంటర్ లో లేపేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక నిందితులు అయిన అసద్ తో పాటు అతని అనుచరుడు గులాంలు ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ పారిపోతున్న సందర్భంలో ఝాన్సీ వద్ద ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ క్రమంలో నిందితులిద్దరు హతం అయ్యారు. ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్ తర్వాత యుపి ఎస్‌టిఎఫ్ బృందాన్ని సీఎం యోగి ప్రశంసించారు. చనిపోయిన ఇద్దరిపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
Read Also: Heat Wave Warning: భానుడి భగభగ.. వచ్చే ఐదు రోజుల్లో 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల
ఈ ఎన్‌కౌంటర్ తరువాత సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. యూపీలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తున్న అధికారులను కృషిని కొనియాడారు. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ ఎన్‌కౌంటర్ వివరాలను సీఎంకు వివరించారు. యూపీ ఎస్టీఎఫ్, డీజీపీ, స్పెషల్ డీజీ లా అండ్ ఆర్డర్, మొత్తం బృందానికి సీఎం అభినందనలు తెలిపారు.
మరోవైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద మౌర్య యూపీ ఎస్టీఎఫ్ బృందానికి అభినందనలు తెలిపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను ప్రయాగ్ రాజ్ కోర్టులో హాజరుపరిచిన రోజే అతడు కుమారుడు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. అసద్, గులాం ఇద్దరి తలపై రూ.5 లక్షల రివార్డు ఉందని స్పెషల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఝాన్సీలోని పరీక్షా డ్యామ్ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మృతులిద్దరూ ఆ ప్రాంతంలో దాక్కున్నారని, అతిక్ అహ్మద్ సన్నిహితుడు వారికి ఆశ్రయం కల్పిస్తున్నాడని పోలీసులు తెలిపారు.