CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ

Cm Vijay

Cm Vijay

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో నేడు మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిన్న మహాబలిపురంలో టీవీకే ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన విజయ్.. దాదాపు మూడు గంటలపాటు వారితో చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నేతలు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారనే అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చే ఆఫర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని, పార్టీ పట్ల విధేయతతో ఉండాలని విజయ్ ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ముఖ్యంగా వివాదాల్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారంపై విజయ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, కళ్లకురిచ్చి ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌కు సంబంధించిన వివాదాలపై వారితో ప్రత్యేకంగా చర్చించారు. ఈ వ్యవహారాల్లో ఇద్దరికీ సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇక, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని విజయ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, అనవసర వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దని హితవు పలికారు.

మరోవైపు ఎమ్మెల్యేల పనితీరును పార్టీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు ఎమ్మెల్యేల పనితీరే ప్రధాన ప్రాతిపదికగా ఉంటుందనే సంకేతాలను విజయ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, డీఎంకే అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలకు విజయ్ సూచించినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ మెజారిటీపై కొనసాగుతున్న రాజకీయ చర్చ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో నేడు మరోసారి విజయ్ సమావేశం కానుండటం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.