NTV Telugu Site icon

CM Nitish Kumar: వచ్చే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుంది.

Cm Nitish Kumar

Cm Nitish Kumar

CM Nitish Kumar comments on BJP: ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇటీవల బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎనిమిదోసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. మణిపూర్ లో జేడీయూ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని భారీ షాక్ ఇచ్చింది.

ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడితే 2024 ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లకు దిగజారుతుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం అన్నారు. పాట్నాలో జరిగిన జేడీయూ కార్యవర్గం సమావేశంలో నితీష్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. బీజేపీని దెబ్బతీసేందుకు నేను పనిచేస్తా అని అన్నారు. ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వారంలో నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల నేతలను కలవనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కాంగ్రెస్ నాయకులను నితీష్ కుమార్ మీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. జేడీయూ కార్యవర్గం సమావేశంలో ప్రతిపక్ష ఐక్యతపై తీర్మాణాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. దేశంలో బీజేపీ నేతృత్వంలో ‘ఎమర్జెన్సీ’ ఉందని పేర్కొంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సీఎం నితీష్ కుమార్ ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బీజేపేతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఆయన కలవబోతున్నారు.

Read Also: Congress: “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో నేడు కాంగ్రెస్ భారీ ర్యాలీ

ఇదిలా ఉంటే జేడీయూ పార్టీపై విరుచుకుపడుతోంది బీజేపీ. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ.. సీఎం నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. కేవలం 5-10 సీట్లు ఉన్న వ్యక్తి ఎలా ప్రధాని అవుతారని ప్రశ్నించారు. పోస్టర్లు, హోర్డింగులు ప్రధానిని చేయవని నితీష్ కుమార్ కు చురకలు అంటించారు. ఇక మణిపూర్ లో జేడీయూ ఎమ్మెల్యేలు ఆరుగురు బీజేపీలో చేరడంపై కూడా రెండు పార్టీల మధ్య విభేదాలను పెంచాయి. బీజేపీ ధనబలంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని జేడీయూ ఆరోపిస్తోంది.