Site icon NTV Telugu

CM KCR: నెక్‌స్ట్‌.. పశ్చిమ బెంగాల్‌కి సీఎం కేసీఆర్‌!. అనంతరం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు. అక్కడ టీఆర్‌ఎస్‌ పోటీ?

Cm Kcr

Cm Kcr

CM KCR: మొన్న బీహార్‌ వెళ్లొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా పశ్చిమ బెంగాల్‌ వెళ్లనున్నారని సమాచారం. అనంతరం.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను సందర్శిస్తారని వార్తలొస్తున్నాయి. ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ నినాదంతో విపక్షాలను ఏకం చేసేందుకు, 2024 జనరల్‌ ఎలక్షన్‌లో అధికార పార్టీ కమలానికి చెక్‌ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బీహార్‌కి ముందు ఆయన ఢిల్లీ, పంజాబ్‌లకు వెళ్లారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు.. పశ్చిమ బెంగాల్‌ టూర్‌లో భాగంగా కేసీఆర్‌.. గల్వాన్‌ ఘటనలో చనిపోయిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. తర్వాత.. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో రాజకీయ చర్చలు జరుపుతారు. అనంతరం.. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు (గుజరాత్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లకు) వెళతారు. అక్కడ వ్యవసాయ, ఇతర సంఘాల నేతలను కలిసి సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ అనుసరిస్తున్న మోడల్‌ను వివరిస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ ఏడాది నవంబర్‌లో, గుజరాత్‌లో డిసెంబర్‌లో, కర్ణాటకలో వచ్చే ఏడాది మే నెలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.

వలసలు తక్కువగా ఉండే ఉద్యోగాలు (టాప్‌-10)

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పోటీ చేయటానికి లేదా ఇండిపెండెంట్లకు మద్దతు ఇవ్వటానికి గల అవకాశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను అక్కడ కూడా అమలుచేస్తారా లేదా అంటూ ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రచారంలో బీజేపీని డిమాండ్‌ చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ పోటీ చేయటం వల్ల ఆ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల విజయావకాశాలు దెబ్బతినవా అన్న ప్రశ్నకు గులాబీ పార్టీ వర్గాలు బదులిస్తూ అలాంటిదేం ఉండబోదని తెలిపాయి. వ్యవసాయ సంఘాల నేతలకు పట్టున్న ఒకటీ రెండు సీట్లలో మాత్రమే మద్దతు ఇచ్చేలా కేసీఆర్‌ స్థానిక నాన్‌ బీజేపీ పార్టీలను కన్విన్స్‌ చేయనున్నట్లు చెప్పాయి. బీహార్‌లో కేసీఆర్‌ పర్యటన భారీగా సక్సెస్‌ అయిందని, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచిందని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పేర్కొన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ప్రశంసించటం పట్ల వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఎంట్రీతో జాతీయ రాజకీయాల దశ దిశ మారిపోతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కె.జనార్ధన్‌ రెడ్డి, డి.రాజేశ్వర్‌రావు ధీమా వెలిబుచ్చారు. ‘మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్దతు పెరుగుతోంది. ఇక్కడ ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సరికొత్త కార్యక్రమాలు అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో వాళ్లు తెలంగాణలోని గుడ్‌ గవర్నెన్స్‌ గురించి తెలుసుకునేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా పెరుగుతోంది’ అని ఎమ్మెల్సీలు చెప్పారు.

Exit mobile version