NTV Telugu Site icon

Maharashtra Polls: సీఎం ఏక్‌నాథ్‌షిండే, అజిత్ పవార్ బ్యాగ్‌లు తనిఖీ.. సహకరించిన అగ్ర నేతలు

Maharashtrapolls

Maharashtrapolls

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల బ్యాగ్‌లు తనిఖీలు చేయడంపై పెద్ద ఎత్తున ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల అధికారులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అగ్ర నాయకుల వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్ హెలిప్యాడ్ దగ్గర సీఎం ఏక్‌నాథ్ షిండే బ్యాగులను తనిఖీ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి బ్యాగుల తనిఖీలకు సహకరించారు. అలాగే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్‌‌ను, బ్యాగులను తనిఖీలు చేశారు. తనిఖీలకు పూర్తిగా సహకరించినట్లు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి సహకరిస్తామన్నారు.

సీఏం ఏక్‌నాథ్‌ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్‌ పోలీస్ గ్రౌండ్‌కు తన హెలికాప్టర్‌తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్‌లో ఉన్న ఏక్‌నాథ్‌ షిండే వ్యక్తిగత స్కూట్‌కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్‌కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్‌కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అలాగే హెలికాప్టర్‌లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే బ్యాగును కూడా ఎన్నికల అధికారులు చెక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు, బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ బ్యాగులు తనిఖీలు చేశారు.