NTV Telugu Site icon

Uttarakhand: డెహ్రాడూన్‌ను తాకిన క్లౌడ్‌బరస్ట్.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

Dehradun Cloudburst

Dehradun Cloudburst

Uttarakhand:: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు రాయ్‌పూర్‌ బ్లాక్‌లో సర్ఖేత్ గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. వరదలు ఆ గ్రామాన్ని అల్లకల్లోలం చేశాయి. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(SDRF) బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించారు. కొందరు సమీపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం పొందారని ఎస్డీఆర్‌ఎఫ్ తెలిపింది.

‘‘శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తప్‌కేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ప్రవహించే తమసా నది భీకరమైన రూపాన్ని సంతరించుకుంది. దీని కారణంగా మాతా వైష్ణో దేవి గుహ యోగ దేవాలయం, తపకేశ్వర్ మహాదేవ్‌ ఆలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు’’ అని ఆలయ వ్యవస్థాపకుడు ఆచార్య బిపిన్ జోషి తెలిపారు.

Rajasthan Accident: ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన ట్రక్కు.. 6గురు దుర్మరణం

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం సమీపంలో శనివారం భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల దృష్ట్యా మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. “భారీ వర్షాల నేపథ్యంలో, కత్రా నుండి వైష్ణో దేవి ఆలయానికి యాత్రికుల తరలింపు నిలిపివేయబడింది. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇప్పటికే మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు” అని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది.

అంతకుముందు జూలైలో, అమర్‌నాథ్ పవిత్ర గుహ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. ఆ సమయంలో వరదల కారణంగా చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. కొన్ని రోజుల పాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.