NTV Telugu Site icon

Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!

Soren

Soren

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా ఆయన కమలం గూటికి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుకు భిన్నంగా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ నుంచి జార్ఖండ్ చేరుకున్న చంపై మీడియాతో మాట్లాడుతూ… కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పారు. గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

త్వరలోనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చంపై తొలుత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అలా కాకుండా కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. కమలనాథులతో చర్చలు ఫలించలేదా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి చంపై కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంకెన్ని సిత్రాలు జరుగుతాయో వేచి చూడాలి.

హేమంత్ సోరెన్.. మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పార్టీలో సీనియర్ సభ్యుడైన చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం హేమంత్ బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతో చంపై సోరెన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే పార్టీలో తనకు అవమానాలు జరిగాయని ఇటీవలే చంపై అవేదన వ్యక్తం చేశారు.