Odisha: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాల హాస్టల్‌లో 10 వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బోర్డు పరీక్షలు రాసిన తర్వాత, హాస్టల్‌కి తిరిగి వచ్చిన బాలిక సోమవారం ఆడ శిశువుకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు.
Read Also: Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..
అసలు ఇది ఎలా జరిగిందో తెలియదని ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన తరగతుల ప్రభుత్వ సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు. బాలికల హాస్టల్‌లోకి పురుషులకు అనుమతి లేదని చెప్పారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులందరికీ హెల్త్ వర్కర్స్ వారాని ఒకసారి పరీక్షలు నిర్వహించాలి. అయితే, ఈ ఘటన ద్వారా హెల్త్ వర్కర్లు సరిగా పనిచేయడం లేదనే విషయం వెల్లడైనట్లు ఆయన అన్నారు.
బాలిక, శిశువుని చిత్రకొండలోని సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాలిక ప్రసవించే వరకు, గర్భం ఎలా కనిపించలేదని బాలిక తల్లిదండ్రులు పాఠశాల అధికారులను ప్రశ్నించారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస ఆచార్య మాట్లాడుతూ.. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు బాలిక గర్భవతి అయి ఉండొచ్చనని చెప్పారు. ఇప్పటికే శాఖపరమైన విచారణ ప్రారంభమైందని చెప్పారు. బాలికను గర్భవతిని చేశాడని అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.