CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!

  • వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం
  • బాలీవుడ్‌లో సినిమా టైటిల్ రిజిస్టర్
  • రూ.20 కోట్ల బడ్జెట్‌తో సినిమా
Cjpprotest

Cjpprotest

నీట్ పేపర్ లీక్‌‌పై ఢిల్లీలో విద్యార్థులు చేసిన ఉద్యమం దేశ వ్యాప్తంగానే కాకుండా.. అంతర్జాతీయంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులకు పైగా జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై బలప్రయోగం చేయడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో విద్యార్థులకు దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, ప్రజల నుంచి గట్టి మద్దతు లభించింది. ఇక చేసేదేమీలేక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉద్యమంతా ఇప్పుడు వెండి తెరపైకి రాబోతోంది. విద్యార్థులు చేసిన ఉద్యమం సంచలనంగా మారడంతో ఉద్యమం సినిమాగా రాబోతుంది. ఈ మేరకు బాలీవుడ్‌లో సినిమా టైటిల్ ఖరారు కావడంతో పాటు రిజిస్టర్ కూడా అయింది.

జైపూర్‌కు చెందిన గోవింద్ దేవ్ పరిశోధన, స్క్రిప్ట్ పని తర్వాత సినిమా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ’ అనే ప్రధాన చలనచిత్రం అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఈ చిత్రం ద్వారా ప్రజలకు తెలియకుండా దాగి ఉన్న ఉద్యమానికి సంబంధించిన అనేక అంతర్గత, దిగ్భ్రాంతికరమైన విషయాలు రూపొందించనున్నారు. ఈ చిత్రం కేవలం ఒక రాజకీయ కథ మాత్రమే కాకుండా.. ఉద్యమాన్ని ఎలా రూపొందించారు. దాని వెనుక ఉన్న వివిధ ఎత్తుగడలకు సంబంధించిన ఇంతవరకు వెలుగులోకి రాని అన్ని కోణాలను కూడా ప్రేక్షకులకు ముందు తీసుకురానున్నారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి కూడా భారీ చర్చ జరుగుతోంది. ప్రధాన నటీనటులు, దర్శకుడు, సహ నిర్మాతలను ఎంపిక చేసేందుకు ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాతలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అలాగే షూటింగ్ లొకేషన్‌ను ఖరారు చేసే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సంచలనాత్మక చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది.