CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..

  • ముంబై CJP నిరసనలో మైనర్ల వినియోగంపై NHRC సీరియస్
  • పిల్లలను ‘రక్షణ కవచాలుగా’ ఉపయోగించారా అనే ఆరోపణ
  • అక్టోబర్ 2న శివాజీ పార్క్‌లో CJP నిరసన
  • మైనర్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
  • ముంబై పోలీస్ కమిషనర్‌కు NHRC నోటీసులు
Cjp Protest

Cjp Protest

CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో నిరసన నిర్వహించింది. అయితే, ఈ నిరసనల్లో మైనర్ పిల్లల్ని ఉపయోగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్ 02న శివాజీ పార్క్‌లో జరిగిన నిరసనల్లో మైనర్లను ఉపయోగించారని, వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ ప్రారంభించింది.

నిరసనకు సంబంధించిన కొన్ని వీడియోల్లో, ఫోటోల్లో చిన్నారులు కనిపించారని, కొందరు రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్నట్లు ఉందని సతీష్ వైద్ మానవహక్కుల సంస్థలో ఫిర్యాదు చేశారు. మైనర్లను నిరసనల్లో భాగం చేయడానికి ముందే కొన్ని గ్రూపులు, చాట్‌లలో చర్చలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి మైనర్ పిల్లల్ని ‘‘రక్షణ కవచాలు’’గా ఉపయోగించారే కోణంలో ఫిర్యాదు అందింది.

దీనిపై NHRC సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ధర్మాసనం ముంబై పోలీస్ కమిషనర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , ఎక్స్ కార్ప్ గ్రీవెన్స్ ఆఫీసర్, మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. నిరసనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించాలని ముంబై పోలీసుల్ని ఆదేశించింది. నేరం బయపడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది.

మైనర్లను ముందుగానే ప్లాన్‌లో భాగంగా తీసుకువచ్చారా? , చట్టపరమైన చర్యల్ని తప్పించుకోవడానికి ఉపయోగించారా? అనే అంశాలను పరిశీలించాలని తెలిపింది. జువైనల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత నిబంధనలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయకుండా చర్చలు తీసుకోవాలని కోరింది. సంబంధిత అధికారులు వారం రోజుల్లో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్(ATR) సమర్పించాలని NHRC కోరింది.