NTV Telugu Site icon

నటి సుధా చంద్రన్‌కు క్షమాపణలు చెప్పిన సీఐఎస్ఎఫ్

ప్రముఖ నటి, ‘మయూరి’ సుధాచంద్రన్‌కు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుధాచంద్రన్‌ గతంలో ఓ ప్రమాదంలో కాలు కోల్పోగా.. ఆమె జైపూర్ కాలు పెట్టించుకున్నారు. అయితే ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు అక్కడ తనిఖీలలో భాగంగా ఆమె కృత్రిమ కాలును తొలగించాలని భద్రతా అధికారులు ఆదేశించారు. దీంతో సుధాచంద్రన్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

Read Also: అన్న అడుగులోనే..కానీ కొత్తగా!

ఈ వీడియోను పరిశీలించిన సీఐఎస్ఎఫ్ సుధాచంద్రన్‌కు వివరణ ఇచ్చింది. విమానాశ్రయాల్లో తనిఖీలలో భాగంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కృత్రిమ అవయవాలు తొలగించి పరిశీలించడం తమ భద్రతా సిబ్బంది విధి అని పేర్కొంది. అయితే సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది ప్రవర్తించిన తీరుపై పరిశీలన చేపడతామని సీఐఎస్ఎఫ్ తెలిపింది. విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించని రీతిలో ప్రవర్తించేలా తమ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తామని పేర్కొంది.