అన్న అడుగులోనే..కానీ కొత్తగా!

2019 లోక్‌సభ ఎన్నికలు నిరాశపరిచినా వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపాలని ప్రియాంక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజల చూపు నిరంతరం తన వైపు ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఎన్నికలు ఆమెలోని గాంధీ కుటుంబ సమ్మోహన శక్తికి పరీక్ష కానున్నాయి. ప్రియాంక తన హావభావాలే కాదు.. యాక్షన్‌ లో కూడా నానమ్మ ఇందిరా గాంధీని గుర్తుచేస్తున్నారు.

మరోవైపు, ప్రియాంక గాంధీ రాజకీంగా తన అన్న రాహుల్‌ గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కానీ ఆప్పుడప్పుడు తనదైన స్టయిల్‌లో. అయనకు కాస్త భిన్నంగా. 2017 యూపీ ఎన్నికల సందర్భంగా నాటి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అనేక రకాల వ్యూహాలు రచించారు. కానీ అవేవీ విజయవంతం కాలేదు. అదుకే ఇప్పుడు ప్రియాంక యూపీ పార్టీ ఇంఛార్జిగా తన అన్న అనుసరించిన మార్గానికి కాస్త భిన్నంగా వెళుతున్నారు. విజయాన్ని సాధించే ప్రయత్నంలో ఆలస్యంగా అయినా వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి ఆమె కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాహుల్ గాంధీ తనను దళితుల శ్రేయోభిలాషిగా చూపించుకునేందుకు ప్రయత్నించారు. దళితుల ఇళ్లకు వెళ్లటమే కాదు వారితో కలిసి భోజనం చేశాడు. ఇప్పుడు ప్రియాంక కూడా దళితుల మనసు గెలిచే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అక్టోబర్ 3 న లఖింపూర్ ఖేరిలో హత్యకు గురైన రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత లక్నోలోని ఒక దళిత వాడలో పర్యటించారు. అక్కడి వాల్మీకి దేవాలయం ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రం చేయటం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ప్రియాంక అందరి దృష్టిని విపరీతంగా అకర్షించారు. ఇది అన్నా చెళ్లెల్ల మధ్య ఒక సారూప్యం.

మాయావతి ప్రభుత్వ భూ సేకరణ విధానానికి వ్యతిరేకంగా 2013 లో ఢిల్లీకి సమీపంలో యుపిలోని భట్టా పర్సాల్‌ని సందర్శించడం ద్వారా రాహుల్ రైతుల హక్కుల రక్షకుడుగా తనను తాను చూపుకున్నారు. ఇప్పుడు విషాద సంఘటన జరిగిన లఖింపూర్ ఖేరీని సందర్శించడం ద్వారా ప్రియాంక రైతులకు అండగా ఉన్నానని చెప్పారు. హింసాకాండలో మరణించిన వారి అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్టోబర్ 10 న వారణాసిలో జరిగిన ‘కిసాన్ న్యాయ్ ర్యాలీ- జస్టిస్ టు ర్యాలీ లో ప్రసంగించారు.

హిందూ ఓట్లు గెలుచుకోవడానికి రాహుల్ గాంధీ 2017 ఎన్నికలకు ముందు దేవాలయాలను సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో దేవొరియా లోని దుగ్ధేశ్వర్‌నాథ్ దేవాలయానికి వెళ్లారు. నుదిటిపై తిలకం దిద్దుకుని ప్రచారాన్ని ప్రారంభించాడు. తరువాత అయోధ్య వెళ్లి అక్కడి హనుమాన్‌గఢి ఆలయంలో పూజలు చేశారు.
ప్రియాంక కూడా వారణాసిలో అక్టోబర్ 10 కిసాన్ న్యాయ్ ర్యాలీకి ముందు దేవాలయాలను సందర్శించడం ద్వారా తన హిందూ గుర్తింపును చాటుకున్నారు. దేవాలయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె రుద్రాక్ష పూసల హారం వేసుకున్నారు. చేతికి పవిత్రమైన దారం కట్టుకున్నారు. నుదుట గంధం బొట్టు పెట్టుకున్నారు. దుర్గా సప్తశతిని పఠించారు. ప్రసంగానికి ముందు ‘జై మాతా ది’ అని నినాదాలు చేశారు.

రాహుల్ గాంధీ యుపిలో అతిధి పాత్రలకు ప్రసిద్ధి. ఉదాహరణకు యూపీ రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఎద్దుల బండిని నడిపాడు. భట్టా పర్సాల్‌లో నిరసన తెలుపుతున్న రైతులను కలవడానికి వెళుతున్నప్పుడు పోలీసులను తప్పించుకోవడానికి అతను టూ వీలర్‌పై కనిపించాడు. ప్రియాంక లఖింపూర్ ఖేరీకి బయలుదేరినప్పుడు ఆమెను నిర్బంధించిన సీతాపూర్ గెస్ట్ హౌస్‌ గదిని పొరకతో ఊడుస్తూ కనిపించారు. లక్నోలోని ఒక దేవాలయంలో కూడా ఆమె అదే చేసింది. సాధారణంగా మహిళలు, దళితులు ఈ పని చేస్తారు. తన ఈ చర్య ద్వారా ఆమె వారికి దగ్గరయ్యే ప్రయత్నం ఇది.

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్, ప్రియాంక మధ్య పోలికలు ఇవి. ఐతే ప్రియాంక పూర్తిగా తన అన్న ప్రచార శైలినే అనుసరించుట లేదు. రాహుల్ సాధారణంగా ముభావంగా ఉండే నాయకుడిలా కనిపిస్తారు. అప్పుడప్పుడు వచ్చి పోయే టూరిస్టులా కనిపిస్తాడు. ప్రియాంక కూడా ఇంచు మించు ఆమె సోదరుడిలాగే ఉంటారు ఈ విషయంలో. అత్యాచారం, హత్య సంఘటనలపై తన నిరసనను నమోదు చేయడానికి ఉన్నావో, సోన్‌భద్ర, హత్రాస్ వంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఆమె రాష్ట్రాన్ని సందర్శిస్తూ వచ్చారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నట్టు ప్రియాంక గాంధీ ఒక పొలిటికల్‌ టూరిస్ట్. కోవిడ్‌ కష్ట కాలంలో ఆమె అటు పక్కకు కూడా వెళ్లలేదన్న విమర్శలున్నాయి.

అయితే, లఖింపూర్ ఖేరీ సంఘటన ప్రియాంక పాత ఇమేజ్‌ని పూర్తిగా మార్చివేసింది. ఆ ఘటన తరువాత ఆమె నిత్య సందర్శకురాలయ్యారు. ఈ నెలలో ఆమె రెండుసార్లు ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్టోబర్ 20 న ఆమె పోలీసు కస్టడీలో హత్యకు గురైన ఒక దళితుడి కుటుంబ సభ్యులను కలవడానికి ఆగ్రా సందర్శించారు. ఆమె ఈ నెలలోనే వారణాసిలో ర్యాలీలో పాల్గొన్నారు.

రాహుల్‌తో పోలిస్తే ప్రియాంకది దూకుడు తత్వం అనిపిస్తుంది. ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆటాడించగలదు. పోలీసుల అణిచివేతకు భయపడి అంగుళం కూడా వెనక్కి తగ్గదు. లఖింపూర్ ఖేరీకి వెళ్లే మార్గంలో సీతాపూర్‌లో అరెస్టయ్యారు. ఐనా వెనకంజ వేయలేదు. మరణించిన రైతుల కుటుంబ సభ్యులను కలవాలనే తన సంకల్పాన్ని ధృఢంగా ప్రదర్శించారు. దాంతో,యూపీ పోలీసులు, ప్రభుత్వం యంత్రాంగం ఆమెను నాలుగు రోజుల పాటు సీతాపూర్ అతిథి గృహంలో నిర్బంధించారు.చనిపోయిన రైతుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆమెను మళ్లీ పోలీసులు అడ్డగించారు. వెళ్లటానికి అనుమతించే ముందు ఆమెను కొన్ని గంటల పాటు నిర్బంధించారు. ఆమె ఆగ్రా సందర్శనలో కూడా ఈ కథ పునరావృతమైంది.

దళితులు, రైతులు, హిందువులతో పాటు అసెంబ్లీ టిక్కెట్లలో మహిళలకు సింహ భాగం ఇస్తున్నారు. 40 శాతం టిక్కెట్లు కేవలం మహిళలకే కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. యూపీ లాంటి రాష్ట్రంలో ఇది ఒక అపూర్వమైన ప్రకటన. దాంతో 403 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 160 మందికి పైగా మహిళలకు టిక్కెట్లను పంపిణీ చేస్తుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అలాంటి ప్రయోగాలు చేయలేదు.

మహిళలను ఆకర్షించడానికి ప్రియాంక ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 12 వ తరగతి పాసైన అమ్మాయిలందరికీ స్మార్ట్‌ఫోన్‌లు , పట్టభద్రులైన అమ్మాయిలందరికీ ఎలక్ట్రిక్ స్కూటీని ఇస్తానని హామీ ఇచ్చారు. లోగడ యూపీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇలాంటివి చేయలేదు. ఇదంతా చూస్తుంటే ఈసారి యూపీ ఎన్నికల్లో ప్రియాంక ఏదో మ్యాజిక్‌ చేస్తుందేమో అనిపిస్తుంది.
-Dr.Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles