NTV Telugu Site icon

Chinese ship: అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్‌కి అలర్ట్..

China

China

Chinese ship: భారత్‌కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ నౌకల గమనాన్ని పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే, మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. తాజాగా చైనా నౌకల్ని మాల్దీవులు అనుమతించడం భారత్‌ని ఆందోళనపరుస్తోంది. ఈ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లు, రిమోట్ ఆపరేటేడ్ వెహికల్స్ (ROVలు) ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది సముద్రగర్భాన్ని మ్యాప్ చేయడంతో పాటు కీలక సైనిక సమాచారాన్ని సంపాదించగలదు.

Read Also: PM Modi: నెహ్రూ గురించి తెలియాలంటే “జాన్ ఎఫ్ కెన్నడీ పుస్తకం చదవండి”..

ఈ నౌకలు పరిశోధన ముసుగులో వ్యూహాత్మక డేటాతో పాటు సముద్ర గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చైనా కార్యక్రమాలు ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు కరాచీలో పాకిస్తాన్ నావికాదళం నిర్వహించే మల్టీ నేషనల్ నేవల్ ఎక్సర్‌సైజ్ సమయంలో కనిపించాయి. ఈ విన్యాసాలలో చైనా ఆర్మీ పాల్గొనే అవకాశం ఉంది. ఈ పరిణామాలు హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ సైనిక సహకారాన్ని మరింత పెంచుతుందనే ఆందోళన నెలకొంది.

గతంలో శ్రీలంక చైనా నౌకల్ని అనుమతించడం కూడా వివాదాస్పదమైంది. హంబన్‌టోట తీరానికి చైనా నౌకలు రావడంపై భారత్ తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది. గత కొంత కాలంగా చైనా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత ఆధిపత్యాన్ని అధిగమించాలని అనుకుంటోంది. దక్షిణాసియా అంతటా తన వాణిజ్య, సైనిక ఆస్తుల్ని కూడబెడుతోంది.