Site icon NTV Telugu

Karnataka: కర్ణాటక తీరంలో చైనీస్ సీగల్ కలకలం.. భద్రతపై అనుమానాలు

Seagullgps Tracker

Seagullgps Tracker

కర్ణాటక తీరంలో చైనీస్‌కు చెందిన సీగల్ కలకలం సృష్టించింది. మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్‌లో కోస్టల్ మెరైన్ పోలీసులు సీగల్‌ను గుర్తించారు. దీంతో భద్రతాపై భయాందోళనలు రేకెత్తించాయి. పక్షి పైభాగంలో చైనీస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉంది. పరికరంలో ఒక చిన్న సోలార్ ప్యానెల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ యూనిట్ ఉంది. ప్రస్తుతం ఈ పక్షిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ తీరప్రాంతంలో పర్యాటకులు విహరిస్తున్నారు. బీచ్ తీరంలో ఒక పక్షి ఉండడాన్ని స్థానికులు గమనించారు. పక్షి పైభాగంలో ఒక ఎలక్ట్రానిక్ పరికరం అమర్చి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సీగల్‌ను స్వాధీనం చేసుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన భద్రతా సంస్థల్లో ఆందోళన కలిగించింది. అయితే పక్షి గాయపడినట్లుగా గుర్తించారు. అటవీ శాఖ అధికారుల పరిశీలన తర్వాత వైద్యం అందించినట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి: Bihar: హిజాబ్ లాగితే తప్పేముంది? నితీష్ కుమార్‌ను వెనకేసుకొచ్చిన కేంద్రమంత్రి

ఇక జీపీఎస్ ట్రాకర్‌కు ఈ-మెయిల్ చిరునామా జతచేయబడి ఉంది. పక్షిని కనుగొన్న ఎవరైనా ఈ-మెయిల్ ఐడీని సంప్రదించాలని అభ్యర్థించినట్లుగా సందేశం ఉన్నట్లుగా అధికారులు కనుగొన్నారు. ఈ మెయిల్ చిరునామా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తో అనుసంధానించబడిందని పోలీసులు తెలిపారు. ఇది పర్యావరణ శాస్త్రాల పరిశోధనా కేంద్రంగా తెలుస్తోంది. స్పష్టత కోసం అధికారులు ఈ-మెయిల్ ఐడీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశోధనలో భాగమా? లేదంటే వేరే కోణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ప్రస్తుతం పక్షిని పరిశీలిస్తున్నట్లు ఉత్తర కానంద పోలీసు సూపరింటెండెంట్ దీపన్ ఎంఎన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: World Richest Families: ప్రపంచ ధనికుల కుటుంబం లిస్ట్ విడుదల.. అంబానీకి ఎన్నో ర్యాంక్ అంటే..!

Exit mobile version