మహరాష్ట్ర నాగ్ పూర్ లో దారుణం జరిగింది. నలుగురు పిల్లలకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తమార్పిడి చేశారు. ఈ విషయాన్ని అధికారులు గురువారం ధ్రువీకరించారు. దీంతో ఆ నలుగురు పిల్లలు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు పిల్లలు హ్యుమన్ డెఫిషియన్సీ వైరస్ ( హెచ్ఐవీ) బారిన పడగా… మరొకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు.
ఈ నలుగురు పిల్లలు కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో రక్తమార్పిడి అవసరం అయింది. పిల్లలకు ఇచ్చిన రక్తం హెచ్ఐవీ పాజిటివ్ వారిది కావడంతో వారికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. ఆరోగ్య కేంద్రాలకు పంపే రక్తం కల్తీ అయి వస్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత విచారణ కమిటీని నియమించింది. ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే ధాకటే తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ (ఎఫ్‌డిఎ) కూడా ఈ కేసుపై విచారణ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. నిజానికి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు రక్తం ఇచ్చే ముందు దానికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్( ఎన్ఏటీ) చేస్తారు. అయితే ఇటు ఆస్పత్రుల్లో కానీ అటు బ్లెడ్ బ్యాంకుల్లో కానీ ఈ సదుపాయం లేకపోవడంతో వ్యాధికారకాలు ఉన్న రక్తం వస్తోందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. అంతకు మందు ఐదుగురు తలసేమియా పిల్లలకు హెపటైటిస్ సీ, ఇద్దరికి హెపటైటిస్ బీ వ్యాధి సోకింది.
