ఛార్ ధామ్ యాత్రలో మృతుల సంఖ్య 31కి చేరిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. మే 4న ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 యాత్రికులు మరణించారని.. ఇందులో 30 మంది యాత్రికులు కాగా.. మరొకరు స్థానికంగా ఉండే వ్యక్తి అని ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల్లోనే పదుల సంఖ్యలో యాత్రికులు మరణించారు.
మరణాలకు ‘మౌంటైన్ సిక్ నెస్’తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యాయని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఎక్కువ మంది యాత్రికులు అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మౌంటైన్ సిక్ నెస్ వ్యాధి వల్లే చనిపోయారని ఆరోగ్య శాఖ డీజీ డాక్టర్ శైలజా భట్ తెలిపారు.
దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఛార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రతీ యాత్రికుడి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాత్రకు అనుమతించాలని ఆదేశించారు. దీంతో పలు రూట్లలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రిషికేష్ ఐఎస్బీటీ, పండుకేశ్వర్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు.
పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉన్న వాళ్లను మాత్రమే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని యాత్రకు రావాలని ప్రభుత్వం యాత్రీకులకు సూచిస్తోంది.